Sangareddy

కూల్చివేతలు లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి

-80 అడుగుల రహదారి కోసం 180 భవనాలు తొలగించాలా?

-రూ.18 కోట్ల నిధులు తెచ్చింది నేనే..

-ఫిర్యాదులతో పనులు అడ్డుకుంటోంది స్థానిక ఎమ్మెల్యేనే: జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులను ప్రజలు, వ్యాపారులకు నష్టం కలగకుండా చేపట్టాలన్నదే తన ఉద్దేశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం బసవేశ్వర విగ్రహం నుంచి ఎల్‌ఐసీ కార్యాలయం వరకు హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కాలినడకన పర్యటించిన ఆయన రహదారి పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రహదారి విస్తీర్ణాన్ని అధికారులతో కొలిపించి, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బైపాస్ రోడ్డు అభివృద్ధికి తాను రూ.18 కోట్ల నిధులు మంజూరు చేయించానని చెప్పారు.

80 అడుగుల రహదారి నిర్మాణం చేపడితే సుమారు 180 భవనాలను తొలగించాల్సి వస్తుందని, వారికి కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఆచరణలో సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఎలాంటి కూల్చివేతలు లేకుండా 50 అడుగుల మేర రహదారిని అభివృద్ధి చేయవచ్చని, దీనివల్ల ఇళ్లు, దుకాణాలు, మెట్లు తొలగించాల్సిన అవసరం ఉండదన్నారు. భవన యజమానులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులకు నష్టం కలగకుండా, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను రూ.18 కోట్ల నిధులు తీసుకొచ్చి రహదారి అభివృద్ధికి చర్యలు చేపడుతుంటే స్థానిక ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు, విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు నిజంగా 80 అడుగుల రహదారి అవసరమని భావిస్తే బైపాస్‌ రోడ్డుపైకి వచ్చి ప్రజల సమక్షంలో కూల్చివేతలపై తన వైఖరిని స్పష్టం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రహదారి అభివృద్ధి చేపట్టడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button