
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఈతగాడు మొహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధిఖీ జాతీయ స్థాయి వాటర్‌పోలో పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆయన ఈ అవకాశం దక్కించుకున్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలోని అక్వాటిక్ కాంప్లెక్స్‌లో జూలై 25న నిర్వహించిన 11వ తెలంగాణ సబ్-జూనియర్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్–2026 ఎంపిక పోటీల్లో రహమాన్ ప్రతిభను ప్రదర్శించారు. దీంతో 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్–2026 వాటర్‌పోలో జట్టులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఐడీఏ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, పిప్లియాహానా స్క్వేర్‌లో సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేష్ తెలిపారు.
రహమాన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆయన స్విమ్మింగ్ కోచ్ శేషుకుమార్ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన సాధన, పట్టుదల, నిరంతర శ్రమతోనే ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణతో పాటు సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి వాటర్‌పోలో పోటీలకు ఎంపిక కావడం ద్వారా రహమాన్ తన క్రీడా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని అధిగమించారని జిల్లా యువజన, క్రీడల అధికారి ధనంజేయులు పేర్కొన్నారు.
రాబోయే పోటీల్లో విజయవంతంగా రాణించి మరిన్ని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమ కుమారుడికి జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం పట్ల రహమాన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా తమ కుమారుడికి క్రమం తప్పకుండా శిక్షణ అందిస్తూ, అతని ప్రతిభను గుర్తించి మరింత మెరుగ్గా రాణించేలా ప్రోత్సహించిన కోచ్ శేషుకుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈతలో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు పోటీలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన వంటి లక్షణాలను జిల్లా స్విమ్మర్లలో పెంపొందించడంలో కోచ్ శేషుకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు.



