Sangareddy

సీఎం సభకు ఘన ఏర్పాట్లు

అధికారులతో జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమావేశం

సంగారెడ్డి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): ఈ నెల 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే సభ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులు, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో సభకు జనసమీకరణ, వాహనాల పార్కింగ్‌, భద్రత, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐఐటీ హైదరాబాద్‌లోని హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి నేరుగా ఐబీ చౌరస్తాకు చేరుకుంటారని తెలిపారు.

అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌గాంధీల విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించే సభా వేదిక వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి సభకు తరలివచ్చే లబ్ధిదారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్‌, వైద్య కళాశాల ప్రాంగణాల్లో పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో నిలిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సుమారు 40 వేల నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు.

అధికారులు సుమారు 20 వేల మంది లబ్ధిదారులను సభకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందితో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి మొత్తం లక్ష మందితో సభను విజయవంతం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు జగ్గారెడ్డి, సంజీవరెడ్డి తెలిపారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్‌కిషన్‌, నాయకులు రఘుగౌడ్‌, కూన సంతోష్‌, కిరణ్‌గౌడ్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button