Uncategorized

మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు

గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధితో ఉపాధి అవకాశాలే లక్ష్యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (రథసారథి న్యూస్):

గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పిపల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను ఘనంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ మేనేజర్ విజేందర్ రెడ్డి, కారిడార్ మేనేజర్ నాగరాజు, పిపల్ ట్రీ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్, సెంటర్ హెడ్ నవీన్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణార్థులకు సాంకేతిక, ప్రాయోగిక నైపుణ్యాలను అందించిన ట్రైనర్లు ప్రశాంత్, హారిక కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజేందర్ రెడ్డి మాట్లాడుతూ, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలిపారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాల్లో చేరాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ తమ కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. పిపల్ ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామీణ యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో డెక్కన్ టోల్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూరా గ్రూప్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే కొత్త మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణా బ్యాచ్ ప్రారంభం కానుందని, శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణులైన యువతీ యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులతో పిపల్ ట్రీ ఫౌండేషన్, బృందావన్ కాలనీ, సంగారెడ్డి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు: 6309417288ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button