Narayankhed

తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ

–తిమ్మాపూర్‌లో తల్లిపాల వారోత్సవాలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కస్తూరిబాయ్, అంగన్వాడీ టీచర్ ఈ. సత్య హాజరై గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరమని తెలిపారు.

ప్రసవానంతరం మొదట వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించే అమూల్యమైన ఆహారమని పేర్కొన్నారు. ముర్రుపాలలోని పోషకాలు, రక్షణ పదార్థాలు శిశువును అనేక వ్యాధుల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. అవసరం లేకుండా డబ్బా పాలను ఇవ్వకుండా తల్లిపాలనే అందించాలని సూచించారు.

శిశువుకు ఆరు నెలలు పూర్తైన తర్వాత తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన అదనపు పోషకాహారాన్ని అందించాలని, ఆహారాన్ని సరైన మోతాదులో, సరైన విధానంలో అందించే అంశాలపై తల్లులకు వివరించారు. శిశువు ఆరోగ్యవంతంగా ఎదగాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శిరీష, ఆశా వర్కర్ మారుని భాయ్, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button