నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్ మోసాలపై విస్తృత అవగాహన కల్పించాలి
-నెలవారీ నేర సమీక్షలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్): ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన నేరాలు, దర్యాప్తులో ఉన్న కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, అదృశ్యమైన వ్యక్తుల కేసులు, న్యాయస్థానాల జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు తదితర అంశాలను సమీక్షించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, అదృశ్య కేసుల ఛేదన, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాల్లో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. నిజమైన నేరస్థులకు శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. దర్యాప్తు సమయంలో సాంకేతిక లేదా న్యాయపరమైన సందేహాలు తలెత్తితే దర్యాప్తు సహాయక కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు షీ బృందాలు నిరంతరం పనిచేయడంతో పాటు మహిళలకు సంబంధించిన చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాద ప్రాంతాలుగా పరిగణించి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే ఆర్థిక నేరాలు, అంతర్జాల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామస్థాయిలో సమాచార సేకరణ కీలకమని ఎస్పీ తెలిపారు. గ్రామ పోలీసు అధికారులు ప్రజలు, యువతతో సత్సంబంధాలు ఏర్పరచుకుని ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
గ్రామాల్లో రౌడీషీటర్లు, పాత నేరస్థులు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. నేరాల ఛేదనలో నిఘా కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని ఎస్పీ సూచించారు. ప్రతి గ్రామంలోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, ధాబాలు, పెట్రోలు బంకులు వంటి కీలక ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పోలీసు స్టేషన్ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలతో అభినందించారు. పోలీసు స్టేషన్ల స్థాయిలోనూ ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులు, సిబ్బందిని గుర్తించి వారికి పురస్కారాలు, ప్రశంసాపత్రాల కోసం సిఫారసు చేయాలని పోలీసు స్టేషన్ అధికారులకు సూచించారు.
అనంతరం అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ఐపీఎస్ పోలీసు స్టేషన్ అధికారులకు కేటాయించిన వాహనాల నిర్వహణను పరిశీలించారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా మరమ్మతులు, సేవలు చేయించి అత్యవసర సమయాల్లో తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు. వాహనాల్లో అత్యవసర సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వాహనాలను పరిశుభ్రంగా, మంచి స్థితిలో నిర్వహిస్తున్న డ్రైవర్లను ప్రత్యేకంగా అభినందించి వారికి పురస్కారాలు ప్రకటించారు. సమావేశంలో డీఎస్పీలు సత్యయ్యగౌడ్, వెంకట్‌రెడ్డి, సైదానాయక్, ప్రభాకర్, సురేందర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదానాగరాజు, జిల్లా ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు సురేష్, రాజశేఖర్‌రెడ్డి, సబ్‌ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



