ప్రభుత్వ మహిళా కళాశాలలో ఘనంగా బోనాల వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బోనాల పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరుణాబాయి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ పద్ధతిలో బోనాలను సమర్పించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని బోనాలను అలంకరించగా, తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
దీంతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా సుమారు 150 మంది విద్యార్థినులకు అన్నదానం చేశారు. భక్తి, సేవాభావం, సామాజిక ఐక్యతను చాటేలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరుణాబాయి మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల భక్తి, జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. యువతలో తెలంగాణ సంస్కృతి, వారసత్వ విలువలపై అవగాహన పెంపొందించేందుకు కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
ప్రజలందరికీ సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత బలపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థినులు చురుకుగా పాల్గొనడాన్ని ఆమె అభినందించారు. భక్తి, సంప్రదాయం, సేవాభావం, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సాగిన బోనాల వేడుకలు కళాశాల విద్యార్థినులు, సిబ్బందిని విశేషంగా ఆకట్టుకున్నాయి.



