అభివృద్ధిపై చర్చకు రండి.. వ్యక్తిగత విమర్శలు వద్దు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని హితవు పలికారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చింత ప్రభాకర్ విశేషంగా కృషి చేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహకారంతో సంగారెడ్డి పట్టణంలో సుమారు రూ.822 కోట్లు, సదాశివపేటలో సుమారు రూ.264 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
ఈ పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ నాయకులు కూడా చర్చకు రావాలని సవాల్ విసిరారు. కరోనా సమయంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చింత ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారని, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. తమ నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, అయితే ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించడం తమ విధానం కాదన్నారు. సంగారెడ్డి అభివృద్ధిపై చర్చకు వస్తే వాస్తవాలు, ఆధారాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఐఐటీ హైదరాబాద్ ఏర్పాటుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైనా బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఐఐటీని తామే తీసుకొచ్చామని చెబుతున్నప్పుడు దానికి ‘ఐఐటీ సంగారెడ్డి’ అనే పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజీవ్ పార్కు అభివృద్ధి విషయంలోనూ గతంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సమయంలో ఆయా నాయకుల వైఖరిని ప్రజలు గమనించారని, ‘జై తెలంగాణ’ నినాదంపై కాంగ్రెస్ నేతలు ముందుగా తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, పదవులు మారుతుంటాయని, ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులే చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి సంగారెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. సమావేశంలో ఎస్కే రషీద్, అక్బర్ హుస్సేన్, కసిని శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, లతీఫ్, జాఫర్, అజ్జు, మజీద్, విష్ణు, నజీం, ఖలీమ్ పటేల్, సమద్, ఖమీల్, కుద్దూస్, వహాబ్, వాజిద్, చింటూ, శ్రవణ్‌రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.



