ఏచూరి పోరాటం నేటి తరానికి ఆదర్శం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
మతోన్మాదానికి, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన సీతారాం ఏచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా సీపీఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘వర్తమాన రాజకీయాలు–సోషలిజం పాత్ర’ అంశంపై స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ పేదలు, కార్మికుల కోసం చివరి వరకు పోరాడిన ఏచూరి నిబద్ధత కలిగిన మహోన్నత నాయకుడని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడిన ఆయన, నూతన ఆర్థిక విధానాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారని తెలిపారు. సమాజంలోని స్వార్థ రాజకీయాలు, శ్రమదోపిడీ, కార్పొరేట్ దోపిడీకి ముగింపు పలికి అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే సోషలిస్టు వ్యవస్థ అవసరమన్నారు. ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిలు, నర్సింహులు, యాదగిరి, కృష్ణ, అశోక్, సతీష్, అనిల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



