Sangareddy

ఆస్పత్రి మరుగుదొడ్డిలో నవజాత శిశువు మృతదేహం

సదాశివపేటలో కలకలం.. తల్లిని గుర్తించేందుకు అధికారుల గాలింపు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):

మానవత్వానికి మచ్చతెచ్చే విషాదకర ఘటన సదాశివపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి మరుగుదొడ్డిలో ఈ నెల 7న అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని అక్కడ వదిలివేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు వెంటనే ఆసుపత్రిని తనిఖీ చేసి, విచారణ చేపట్టారు. ఈ నెల 7వ తేదీతో పాటు అంతకుముందు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలకు సంబంధించిన వివరాలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చిన గర్భిణుల వివరాలను సేకరిస్తున్నారు. శిశువు తల్లిని గుర్తించేందుకు మండలంలోని ఆశా కార్యకర్తలను అధికారులు అప్రమత్తం చేశారు. సమీప గ్రామాల్లో ఇటీవల ప్రసవించిన మహిళలు, గర్భిణుల వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నవజాత శిశువు మృతదేహాన్ని ఆసుపత్రి మరుగుదొడ్డిలో వదిలివేసిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button