రాజకీయ డ్రామాలు మానుకోవాలి
తెలంగాణ రక్షణ సేన జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి నెమలికొండ వేణుమాధవ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి నెమలికొండ వేణుమాధవ్ సూచించారు. మంగళవారం సదాశివపేటలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు శంకర్‌నాయక్‌లతో కలిసి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుమాధవ్ మాట్లాడారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల్లో చింతా ప్రభాకర్, జగ్గారెడ్డి వివిధ హోదాల్లో అధికారాన్ని పంచుకున్నారని పేర్కొన్నారు. ఇంతకాలం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పోతిరెడ్డిపల్లిలో బస్టాండ్ నిర్మాణం, సదాశివపేటలో సబ్‌కోర్టు ఏర్పాటు వంటి కీలక అంశాలు ఏళ్లుగా ప్రజల తీరని కోరికలుగానే మిగిలిపోయాయని వేణుమాధవ్ అన్నారు. ప్రజల మౌలిక వసతులు, అభివృద్ధి, ఉపాధి వంటి సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు మాని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.



