ఎఫ్ఎల్ఎన్ అమలుపై డీఈఓ రోహిణి సమీక్ష
-చేర్యాల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 27 (రథసారథి న్యూస్):
కంది మండలంలోని చేర్యాల ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన అభ్యసన సామర్థ్యాలు, విద్యార్థులు వాటిని ఏ మేరకు సాధించారనే వివరాలను తరగతి గదుల్లో ప్రదర్శించాలని సూచించారు.
ఎఫ్ఆర్ఎస్ హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని తరగతుల విద్యార్థుల వర్క్‌బుక్‌లను ఎప్పటికప్పుడు సరిచేసి, వారు అభ్యసిస్తున్న అంశాలను వారి స్థాయికి అనుగుణంగా తరగతి గదుల్లో ప్రదర్శించాలని సూచించారు. పాఠశాలలోని అన్ని రిజిస్టర్లు, రికార్డులు, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల వివరాలు, ఏజీఆర్, మధ్యాహ్న భోజన పథకం తదితర రికార్డులను పరిశీలించారు.
విద్యార్థులను స్వయంగా పిలిచి చదివించడంతో పాటు రాయించారు. ప్రతి తరగతి గదిలో లక్ష్య నిర్దేశం, వార్షిక ప్రణాళికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ముఖ్యంగా 2, 3వ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరును పెంచేందుకు వారి ఫొటోలతో ఆకర్షణీయమైన చార్టులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీనివల్ల విద్యార్థుల హాజరు శాతం పెరిగినట్లు తెలిపారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన బోధన–అభ్యసన సామగ్రి (టీ.ఎల్.ఎం.) ప్రదర్శనను పరిశీలించారు.
పూర్వ ప్రాథమిక పాఠశాల పెయింటింగ్ పనులను కూడా పరిశీలించారు. కాశీపూర్ కేజీబీవీలో అమలవుతున్న కార్యక్రమాలు, ఖాన్ అకాడమీ, డిజిటల్ అభ్యసనకు సంబంధించిన పుస్తకం తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రోహిణి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జోగప్ప, డీసీఈబీ కార్యదర్శి లింభాజీ, డీఎస్ఓ సిద్ధారెడ్డి, ఎస్ఓ మీరాబాయి, ప్రధానోపాధ్యాయులు రాఘవులు, ఆర్పీలు ఆనంద్, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.



