Sangareddy

రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్‌ ధరించండి

రక్షాబంధన్‌ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ శుభాకాంక్షలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 27 (రథసారథి న్యూస్): రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ హృదయపూర్వక రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్‌ పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మహిళలు అధికంగా సంచరించే ప్రదేశాల్లో షీ బృందాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు.

మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే జిల్లా షీ బృందం 8712656772 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. రక్షాబంధన్‌ పండుగను ప్రజలంతా ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు.

చెల్లి కట్టే రాఖీ రక్షణకు ప్రతీక. అదే విధంగా మనం ధరించే హెల్మెట్‌ ప్రాణాలకు రక్షణ కవచం. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు.. మన కుటుంబం కోసం కూడా హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button