Sangareddy

ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి

సెప్టెంబర్‌ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలి..

-అర్హులైన ప్రతి పౌరుడు ఎస్‌ఐఆర్‌లో భాగస్వామి కావాలి

-కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 2 (రథసారథి న్యూస్): భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతున్నందున అర్హత కలిగిన ప్రతి పౌరుడు ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌లో భాగంగా ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. జాబితాలో తమ పేరు, వయస్సు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకుని ఏవైనా తప్పులు, మార్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 16లోగా సంబంధిత ఓటరు నమోదు అధికారి (ఈఆర్‌ఓ) వద్ద క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయాలని సూచించారు.

అర్హులైన పౌరులు ఓటరు జాబితాలో పేరు నమోదు, వివరాల సవరణ తదితర అంశాలకు సంబంధించి నిర్దేశిత విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో స్వీకరించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల వివరాలను ప్రజల సమాచారార్థం అందుబాటులో ఉంచుతామని, సంబంధిత ఈఆర్‌ఓలు వాటిని వారానికి ఒకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తారని పేర్కొన్నారు.

జాబితాలో చేర్చిన ఏదైనా క్లెయిమ్‌పై అభ్యంతరం ఉన్న పౌరులు కూడా నిర్దేశిత విధానంలో సంబంధిత ఈఆర్‌ఓను సంప్రదించవచ్చన్నారు. ఈఆర్‌ఓ తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి చెందని వారు మొదటి అప్పీల్‌ అధికారిగా జిల్లా మేజిస్ట్రేట్‌కు, అక్కడి నిర్ణయంపై కూడా అభ్యంతరం ఉంటే రెండో అప్పీల్‌ అధికారిగా ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ)కు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్‌ వివరించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రతి అర్హత కలిగిన పౌరుడికి అవగాహన కల్పించేలా ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పౌరుడు తన ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన చోట క్లెయిమ్‌లు లేదా అభ్యంతరాలను గడువులోగా దాఖలు చేసి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్‌ కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button