పేదల ఆత్మగౌరవానికి ప్రతీక స్మార్ట్ రేషన్ కార్డు

-మామిడిపల్లిలో అర్హులైన కుటుంబాలకు పంపిణీ
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్): పేదల ఆహార భద్రతతో పాటు ఆత్మగౌరవాన్ని కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని కాంగ్రెస్ నాయకుడు సోల్కంపల్లి ప్రభు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సోల్కంపల్లి ప్రభు మాట్లాడుతూ.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పాస్‌పోర్టు, గుర్తింపు కార్డుల తరహాలో భద్రతా ప్రమాణాలతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అందించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సోల్కంపల్లి ప్రభు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌స్వామి, గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు జాకీర్, మల్లయ్య, ఈ.రాజు, ఇనాయత్, వెంకటేష్, గోపాల్ తదితరులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



