ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన

ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
-మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక కార్యక్రమాలు
-యువతకు ప్రాధాన్యత.. 70 వేలకు పైగా ఉద్యోగాల కల్పన
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు.. సన్నబియ్యం పంపిణీ
-విలేకరుల సమావేశంలో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి పాలనను కొనసాగిస్తున్నామని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రభుత్వ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మిగిలిన హామీలను కూడా రానున్న రెండేళ్లలో అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
-మహిళల ఆర్థిక బలోపేతానికి చర్యలు
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారని నిర్మలా జగ్గారెడ్డి గుర్తుచేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలను బస్సులకు యజమానులుగా తీర్చిదిద్దడంతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణ, పావలా వడ్డీ రుణాలు తదితర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరలను కూడా మహిళలు సంతోషంగా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.
-రైతులకు రుణమాఫీ.. బోనస్
రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఏకకాలంలో పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సన్నబియ్యం రకాలను పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నామని వివరించారు.
-అర్హులందరికీ రేషన్ కార్డులు
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్లక్ష్యం జరిగిందని నిర్మలా జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఆహార భద్రత కల్పించిందన్నారు. రేషన్ కార్డుల ద్వారా పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత చేరువయ్యాయని చెప్పారు. సన్నబియ్యాన్ని రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
-నిరుపేదలకు సొంతింటి కల
సొంత ఇల్లు లేని నిరుపేదల కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
-విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
విద్యారంగంలోనూ ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిందని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తూ విద్యతో పాటు పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గతంలో వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఓసీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యం మరింత చేరువ చేశామని వివరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం ఎన్నికల వాగ్దానాలుగా కాకుండా బాధ్యతగా భావించి అమలు చేస్తున్నామని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. రానున్న రెండేళ్లలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, బ్లాక్ అధ్యక్షుడు జార్జ్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆర్.కిరణ్‌గౌడ్, సీనియర్ నాయకుడు కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



