Sangareddy

లోధా సామాజిక వర్గ స్థితిగతులపై బీసీ కమిషన్‌ క్షేత్రస్థాయి విచారణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 16 (రథసారథి న్యూస్): లోధ్‌/లోదా సామాజిక వర్గ ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, వృత్తి, జీవన పరిస్థితులను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఆధ్వర్యంలో బుధవారం క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. సిర్గాపూర్‌ మండలం కడప్పల్‌ గ్రామంలోని రైతు వేదికతో పాటు నిజాంపేట్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో లోధా సామాజిక వర్గ ప్రజలతో కమిషన్‌ ప్రతినిధులు సమావేశమై వారి సమస్యలు, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, డా.బాలలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్‌ ఈ విచారణలో పాల్గొన్నారు. కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ మాట్లాడుతూ లోధా సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని కోరుతూ గత కొన్ని సంవత్సరాలుగా కమిషన్‌కు వినతులు అందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గం ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను సందర్శించి వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు, సంప్రదాయాలు, వృత్తులు, జీవన విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో లోధా సామాజిక వర్గ ప్రజలు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు.

కొన్ని ప్రాంతాల్లో వారికి వెనుకబడిన తరగతుల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నప్పటికీ సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అలాంటి ధ్రువీకరణ పత్రాలు అందడం లేదని ప్రజల నుంచి వినతులు వచ్చినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వివరాలు, ఆధారాలను సమగ్రంగా సమర్పించడంలో జరిగిన లోపాల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి విచారణలో భాగంగా లోధా సామాజిక వర్గ ప్రజల కుటుంబ పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వృత్తులు, జీవన విధానం, పిల్లల విద్య తదితర అంశాలను నమోదు చేసుకుంటున్నట్లు చైర్మన్‌ తెలిపారు. విచారణ పూర్తయిన అనంతరం సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకు నివేదిక సమర్పిస్తామని చెప్పారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్‌ కోటా ప్రయోజనాలను అర్హులైన వారు వినియోగించుకోవాలని సూచించారు.

నారాయణఖేడ్‌ ఉపవిభాగాధికారి ఉమాహారతి మాట్లాడుతూ లోధా సామాజిక వర్గ ప్రజల సమస్యలు, స్థితిగతులను తెలుసుకునేందుకు బీసీ కమిషన్‌ క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, లోధా సామాజిక వర్గ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి పథకాల వివరాలు తెలుసుకుని అర్హత మేరకు ప్రయోజనాలు పొందాలని సూచించారు. నారాయణఖేడ్‌ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని కోరారు.

తల్లిదండ్రుల కమిటీ సమావేశాలకు హాజరై పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కొత్త పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని, ఇందుకోసం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్‌, డీఎస్పీ, తహసీల్దార్‌ కిరణ్‌, ఎంపీడీవో, సర్పంచులు, లోధా సామాజిక వర్గ పెద్దలు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button