
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్): తారా ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం అధ్యక్షురాలు, అధ్యయన మండలి అధ్యక్షురాలు ప్రొఫెసర్ కె. శైలజ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాధాన్యత, పర్యావరణ సమతుల్యతలో దాని పాత్ర, పొర క్షీణతకు కారణాలు, దాని ప్రభావాలపై అవగాహన కల్పించారు.
సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవరాశులను ఓజోన్ పొర రక్షిస్తుందని వివరించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు ప్రకృతి వనరులను సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ మాట్లాడుతూ ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్. విజయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సరోజిని చక్రవర్తి, డాక్టర్ సోఫియా రాణి తదితరులు పాల్గొని విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రోత్సహించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఓజోన్ పొర పరిరక్షణతో పాటు పర్యావరణ బాధ్యతపై అవగాహన పెంపొందింది.



