Sangareddy

బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలి

-ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలి

-80 అడుగుల రహదారి ఉన్నచోట 80 అడుగులే నిర్మించాలి: బీఆర్‌ఎస్‌ నాయకులు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 16 (రథసారథి న్యూస్): సంగారెడ్డి బైపాస్‌ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించేలా ఉన్నాయని మాజీ సీడీసీ చైర్మన్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ విజేందర్‌రెడ్డి విమర్శించారు. బైపాస్‌ రోడ్డు నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నాయకులు ఖండించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజేందర్‌రెడ్డి, రామప్ప, కౌన్సిలర్లు పొన్న రాజేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు విలేకరులతో మాట్లాడారు. బైపాస్‌ రోడ్డుపై ప్రతిరోజూ వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రహదారిపై ఏర్పడిన గుంతలు, పెరుగుతున్న రద్దీ, పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మళ్లీ రహదారి విస్తరణ చేపట్టాల్సిన పరిస్థితి రాకుండా ప్రస్తుతం ఉన్న రహదారి విస్తీర్ణానికి అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని అన్నారు. 80 అడుగుల రహదారి ఉన్నచోట 80 అడుగులు, 60 అడుగుల రహదారి ఉన్నచోట 60 అడుగుల మేర అభివృద్ధి చేయాలని, కేవలం 50 అడుగుల రహదారితో పెరుగుతున్న రాకపోకలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా అని ప్రశ్నించారు. రహదారి పనుల నాణ్యత, నిర్మాణం ఆలస్యం కావడానికి గల కారణాలను అధికారులు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఐబీ ఆవరణలో అభివృద్ధి పనుల కోసం నిర్మాణాలను తొలగించినప్పుడు ప్రజా ప్రయోజనాల గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పట్టణ అభివృద్ధిపై మాట్లాడే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి నిధుల మంజూరు, వాటి వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

రాజీవ్‌ పార్కు అభివృద్ధి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, పలువురు ముఖ్యమంత్రులు మారినా పార్కు అభివృద్ధి పూర్తిస్థాయిలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కృషితో పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు తీసుకువచ్చి వివిధ వార్డుల్లో పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలకు రాజకీయ విమర్శలు కాకుండా నాణ్యమైన అభివృద్ధి పనులు, మెరుగైన రహదారులు, సౌకర్యవంతమైన ప్రయాణం అవసరమని అన్నారు. బైపాస్‌ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేసి, గుంతలను పూడ్చి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రహదారిని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు లాడే మల్లేశం, నవీన్‌, సురేష్‌, కసిని శ్రీకాంత్‌, విఠల్‌, వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button