ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేయాలి
-అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణుల వినతిపత్రం

-కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం.. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (రథసారథి న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచనల మేరకు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం
అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వచ్చిన ప్రజాప్రతినిధులపై నిర్బంధాలు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అన్నారు.
-కేసీఆర్పై వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్నపల్లి శంకర్, వేముల వీరేశం చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత ఎమ్మెల్యేలపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.
-రోడ్డుపై బైఠాయించి నిరసన.. నాయకుల అరెస్ట్
అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలి.. 420 హామీలు నెరవేర్చాలి, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చింతా సాయినాథ్, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ద్వారా ఉద్యమాలను అణచివేయలేరని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నించినందుకు అరెస్టులు చేయడం కాదు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, హకీమ్, విజేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, చింతా సాయినాథ్, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, నాగరాజు గౌడ్, యువజన నాయకులు శ్రవణ్ రెడ్డి, వాజిత్, వేణుగోపాలస్వామితో పాటు పెద్ద ఎత్తున యువకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



