అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ మృతి
-మృతదేహానికి ఎస్పీ పరితోష్ పంకజ్ ఘన నివాళి.. కుటుంబానికి ఆర్థిక సాయం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (రథసారథి న్యూస్): సంగారెడ్డి మహిళా పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. పోలీసు శాఖ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ 1993లో ఉమ్మడి మెదక్ జిల్లాలో సివిల్ పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి పోలీసు శాఖలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించారు.
గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. హరిప్రసాద్ మృతితో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్యగౌడ్, మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్‌కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జనార్దన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



