బుదేరా గురుకుల కళాశాలలో న్యాయ అవగాహన

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుదేరా గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు వివిధ చట్టాలు, న్యాయ హక్కులు, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక న్యాయ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలికలు, మహిళల రక్షణకు అమలులో ఉన్న చట్టాలతోపాటు మహిళలపై వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, బాలల రక్షణ, సైబర్ నేరాలపై విద్యార్థినులకు వివరించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుతుందని సౌజన్య పేర్కొన్నారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను ధైర్యంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకుని, కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతరులకు కూడా న్యాయ హక్కులపై అవగాహన కల్పించాలని విద్యార్థినులను కోరారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, పోలీసు అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.



