Sangareddy

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు

తారా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 11 (రథసారథి న్యూస్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల (ఎ)లో ఈకో క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభ్రమైన–పచ్చని ప్రాంగణం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం. ప్రవీణ్‌ మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగులతో తయారు చేసే ప్రతిమలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అందువల్ల సహజమైన మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను వినియోగించడం పర్యావరణహితమైన విధానమని వివరించారు.విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు, పండుగలను ప్రకృతికి హాని కలగకుండా నిర్వహించాలనే బాధ్యతను కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈకో క్లబ్‌ సమన్వయకర్త డాక్టర్‌ బి. సోఫియా రాణి, ఉప ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుచిత్రా సింగ్‌తో పాటు పలువురు అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మట్టి వినాయక ప్రతిమల తయారీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. మట్టి వినాయకుడు–పర్యావరణానికి మేలు, మన ఆరోగ్యానికి మేలు’ అనే సందేశాన్ని విద్యార్థులు సమాజానికి అందించారు. మట్టి ప్రతిమల వినియోగం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు రసాయనాలు, ప్లాస్టిక్‌ వినియోగానికి దూరంగా పర్యావరణహిత పండుగలను నిర్వహించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button