Sangareddy

బీఆర్ఎస్ అరాచకానికి ప్రజలే బుద్ధి చెబుతారు

దళితులను అవమానిస్తే భారీ మూల్యం తప్పదు

బీఆర్ఎస్ అరాచకంపై సంగారెడ్డి లో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 11 (రథసారధి న్యూస్):

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రామ్‌నగర్‌లోని జగ్గారెడ్డి నివాసం నుంచి పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నిర్మలా జగ్గారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరాచకం, గూండాయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరించడం దారుణమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదని విమర్శించారు.

బీఆర్ఎస్ నేతలు తమకు తామే నెట్టుకుని, పోలీసులపై దాడి చేసి, తిరిగి తామే బాధితులమన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. దళిత వర్గాన్ని అవమానించేలా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, చర్యలను రాష్ట్ర ప్రజలంతా గమనించారని పేర్కొన్నారు. దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం బీఆర్ఎస్ పార్టీ కుసంస్కారానికి, అనాగరిక చర్యలకు నిదర్శనమని నిర్మలా జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దళితులను అవమానించే విధంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని, ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిర్మలా జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్మెన్ కూన వనితా సంతోష్,సిడిసి ఛైర్మెన్ రామ్ రెడ్డి, నాయకులు జార్జ్ ,కిరణ్ గౌడ్, సంతోష్ , శ్రీకాంత్ , రామ్ చందర్ నాయక్ , శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి,భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button