ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. పూర్తి వివరాల కోసం వైద్యుల నిరీక్షణ
జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్: జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా వివరాలు వెల్లడించారు.
వైద్యుల సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం సుమారు 9:30 గంటలకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన సోదరుడు, స్నేహితులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఆయన అపస్మారక స్థితిలో ఉండటంతో, వెంటనే స్టమక్ వాష్ నిర్వహించి రక్త, మూత్ర నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
ప్రస్తుతం ఆయన కీలక ఆరోగ్య సూచికలు (బీపీ, పల్స్, ఆక్సిజన్ శాచురేషన్) సాధారణంగా ఉన్నాయని, అయితే ఇంకా పూర్తి స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం డ్రౌజీ (మత్తుగా) స్థితిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
స్టమక్ వాష్ సమయంలో ఎలాంటి టాబ్లెట్లు, ఆహార అవశేషాలు లేదా అసాధారణ పదార్థాలు కనిపించలేదని, కేవలం క్లియర్ లిక్విడ్ మాత్రమే బయటకు వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఉదయ్ కృష్ణారెడ్డి ఆహారం తీసుకోకుండా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆయన గది వద్ద ఆల్కహాల్ బాటిల్, శానిటైజర్ బాటిల్ కనిపించడంతో ఏదైనా పదార్థాన్ని ప్రమాదవశాత్తు సేవించి ఉండవచ్చన్న అనుమానంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్యుల అంచనా ప్రకారం, ఆయన పూర్తిగా స్పృహలోకి రావడానికి మరో 24 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. రక్త, మూత్ర పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత, అలాగే ఆయన స్పృహలోకి వచ్చి వివరాలు వెల్లడించిన అనంతరం మాత్రమే ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్య బృందం తెలిపింది.
ఇదిలా ఉండగా, జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడినట్లు ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు అంశాలు పరస్పరం వేర్వేరు ప్రక్రియలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.



