24 గంటల్లో చోరీ కేసు ఛేదించిన రాయికోడ్ పోలీసులు
నిందితుడి అరెస్ట్ – జ్యుడీషియల్ రిమాండ్కు తరలింపు-పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగాపూర్ గ్రామానికి చెందిన కాలిమొల్ల నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయికోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నెల 18న గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు 20 తులాల వెండి పట్టీలు (విలువ రూ.11 వేల)తో పాటు రూ.25 వేల విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్ను అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ రూ.36 వేలుగా పోలీసులు తెలిపారు.
కేసు నమోదు అనంతరం రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ఇతర శాస్త్రీయ సాక్ష్యాలను సేకరించి వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంగాపూర్ గ్రామానికి చెందిన మడిగడ్డ బసవరాజ్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి, కేసు నమోదైన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, కేసును అత్యంత వేగంగా ఛేదించిన రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్తో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.



