నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలి: మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసిం
జిల్లా పోలీసు కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (రథసారథి న్యూస్): వార్షిక తనిఖీలలో భాగంగా మల్టీ జోన్–2 ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) షానవాజ్ ఖాసిం, ఐపీఎస్ గురువారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గౌరవ వందనం స్వీకరించిన ఐజీ, ఎస్పీతో కలిసి మొక్కలు నాటి, పునరుద్ధరించిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి వాటి పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఐజీ మాట్లాడుతూ, నేరాలు జరిగిన తర్వాత వాటిని ఛేదించడం కంటే ముందస్తుగా నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు.
అధిక నేరాలు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టడంతో పాటు వాటిని జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో సైబర్ సెల్, ఐటీ సెల్ మరింత చురుకుగా పనిచేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డీసీఆర్బీ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఫిర్యాదును సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్–2.0, ఈ-సాక్ష్య, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని వాటిని సమర్థంగా వినియోగించాలని తెలిపారు. వర్షాకాలంలో చెరువులు, కుంటల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఐజీ, స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది వసతి గదులను పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు తక్షణమే స్పందించి క్షతగాత్రులకు సకాలంలో సహాయం అందించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అనుమానిత వ్యక్తులు, పత్రాలు లేని వాహనాలపై నిరంతర తనిఖీలు చేపట్టాలని డీఎస్పీలకు ఆదేశించారు.
విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, జిల్లాలోని పోలీసు కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని ఐజీ షానవాజ్ ఖాసిం అభినందించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి రివార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, వివిధ డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఆర్‌ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.



