నారాయణఖేడ్ నియోజకవర్గంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి
ప్రభుత్వ భూములను సర్వే చేసి పారదర్శకంగా పంపిణీ చేయాలి: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ ఎస్. చిరంజీవి

నారాయణఖేడ్ ప్రతినిధి, జూలై 25 (రథసారథి న్యూస్):
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను సమగ్రంగా సర్వే చేసి అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, అలాగే ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఎస్. చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పేద కుటుంబాలు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
జనాభా పెరుగుదలతో నివాస స్థలాల కొరత ఏర్పడి, అనేక కుటుంబాలు ఇరుకైన ప్రదేశాల్లో జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కొందరు అక్రమంగా ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములపై కబ్జాలను అరికట్టి వాటిని పరిరక్షించడంతో పాటు, అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
నారాయణఖేడ్ పట్టణంలో కూడా ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ భూములను సమగ్రంగా సర్వే చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు లక్ష్మణ్, సోయల్ సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.