Sangareddy

పుల్కల్ మండలంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విస్తృత పర్యటన

కేజీబీవీ, పీహెచ్‌సీ తనిఖీ – యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 24 (రథసారథి న్యూస్):

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం పుల్కల్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), బస్వాపూర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా బస్వాపూర్‌లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు పూర్తి చేసి విద్యార్థులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, సంబంధిత మంత్రి చేత ప్రారంభోత్సవం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పాఠశాల ఆవరణ, డార్మిటరీ, తరగతి గదులు, స్టోర్‌రూమ్, వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఈగలు, దోమలు పెరగకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందించాలని, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరో తరగతి విద్యార్థినులతో కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి పాఠ్యాంశాలను చదివించి అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం వారికి నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే విజయ శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థినులకు ప్రోత్సాహకరంగా సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు, మండల విద్యాధికారి (ఎంఈఓ), కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button