శాకాంబరి అలంకారంలో ముత్యాలమ్మ అమ్మవారి దివ్యదర్శనం
సికింద్రాబాద్ తుకారాంగేట్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు

సికింద్రాబాద్ ప్రతినిధి, జులై 26 (రథసారథి న్యూస్): సికింద్రాబాద్ తుకారాంగేట్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వేదమంత్రాల నడుమ అమ్మవారికి పవిత్రాభిషేకం నిర్వహించిన అనంతరం, శాకాంబరి అలంకారంతో సర్వాంగసుందరంగా అలంకరించి భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.
అనంతరం నిర్వహించిన కుంకుమార్చన పూజలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన భజన కార్యక్రమంలో భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారి కృపాకటాక్షాలు అందాలని ప్రార్థనలు చేశారు.