విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన షీ టీం
-ఐదు వందల మంది విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై సూచనలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్): జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సంగారెడ్డి షీ టీం ఆధ్వర్యంలో ఇష్టా కళాశాల మరియు సాయి కృష్ణ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షీ టీం సిబ్బంది మాట్లాడుతూ, మహిళలు, బాలికల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు, బాలల సంరక్షణకు సంబంధించిన నిబంధనలు, సైబర్ నేరాల నుంచి రక్షణ పొందే మార్గాలను విద్యార్థులకు వివరించారు.
సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితుల నుంచి వచ్చే సందేశాలు, లింకులు, మోసపూరిత ఆన్‌లైన్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని, మహిళల భద్రతకు సంబంధించిన సహాయ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.



