Sangareddy

పదవీ విరమణ పొందిన ఏఎస్‌ఐ మోహన్‌కు ఘన సన్మానం

-నిబద్ధతతో సేవలందించిన పోలీసు అధికారి అని ప్రశంసించిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 రథసారథి న్యూస్: పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) మోహన్కు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) చైతన్య రెడ్డి, ఐపీఎస్ హాజరై మోహన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. మోహన్ 1992లో సివిల్ పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి, ఉమ్మడి మెదక్ జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తూ శాఖకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. సేవా కాలమంతా క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించి అధికారుల ప్రశంసలు అందుకున్నారని, ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సుఖసంతోషాల మధ్య ఆనందంగా జీవించాలని ఆకాంక్షించిన అదనపు ఎస్పీ, పోలీసు శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సురేష్, సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ మోహనప్ప, పదవీ విరమణ పొందిన ఏఎస్‌ఐ మోహన్ కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button