ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, తాగునీరు, సంక్షేమ సేవలే ప్రభుత్వ లక్ష్యం
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి – రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలతో పాటు విద్య, తాగునీరు, వ్యవసాయం, రెవెన్యూ, మహిళా–శిశు సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయి పరిస్థితులపై శాఖల వారీగా సమగ్రంగా సమీక్షించారు. వైద్య, ఆరోగ్య సేవల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, జోగిపేట ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన వైద్యుడి స్థానంలో నకిలీ వ్యక్తి డాక్టర్‌గా విధులు నిర్వహించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు, విధుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డీసీహెచ్ఎస్, ఆసుపత్రి సూపరింటెండెంట్లను ఆదేశించారు.
కంకోల్, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, బర్దిపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జహీరాబాద్ మాతా–శిశు ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు సూచించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. విద్యా రంగంలో కేజీబీవీలు, మోడల్ పాఠశాలలు, జడ్పీహెచ్ఎస్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మరుగుదొడ్ల సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించి, చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలని మంత్రి అన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్ల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సమీక్షించిన మంత్రి, ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాగునీటి పరిస్థితిపై సమీక్షిస్తూ మంజీర, సింగూరు ప్రాజెక్టుల నీటి నిల్వలు, బోరంచ, భూసారెడ్డిపల్లి ఇంటెక్ వెల్ల ద్వారా జరుగుతున్న నీటి సరఫరా వివరాలను మంత్రి తెలుసుకున్నారు.
రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



