ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు కనీస వేతనాలు అమలు చేయాలి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ ఎస్. చిరంజీవి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఎస్. చిరంజీవి డిమాండ్ చేశారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో అనేక మంది ఉపాధ్యాయులు తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ఆర్థిక, సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంబంధిత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు.
అర్హులైన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, వేతనాలను బ్యాంకు ఖాతాల ద్వారా పారదర్శకంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయని పాఠశాలల్లో విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని చిరంజీవి అన్నారు. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారి పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ సోయల్ తదితరులు పాల్గొన్నారు.



