భక్తిశ్రద్ధలతో భద్రకాళి అమ్మవారికి శాకాంబరి అలంకరణ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): ఆషాఢ మాస అమావాస్యను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
శాకాంబరి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అలంకరణకు ఉపయోగించిన కూరగాయలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు చక్రేశ్వర్‌తో పాటు ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



