ప్రజావాణికి 71 ఫిర్యాదులు

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
-అదనపు కలెక్టర్లు సంగీత, పాండు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 (రథసారథి న్యూస్): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు, వినతులను వారు స్వీకరించారు.
ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, తీసుకున్న చర్యలను నమోదు చేయడంతో పాటు దరఖాస్తుదారులకు స్పష్టమైన సమాధానం అందించాలని సూచించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో నిర్వహిస్తున్న మండలస్థాయి ప్రజావాణిని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం జిల్లావ్యాప్తంగా మొత్తం 71 ఫిర్యాదులు, వినతులు అందగా, కలెక్టరేట్లో 41, సంగారెడ్డి డివిజన్లో 22, జహీరాబాద్ డివిజన్లో 5, నారాయణఖేడ్ డివిజన్లో 3 ఫిర్యాదులు నమోదయ్యాయి.
అందోల్ డివిజన్లో ఎలాంటి ఫిర్యాదులు, వినతులు అందలేదు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పింఛన్లు, పంచాయతీరాజ్, పోలీస్, ఆర్టీసీ, కాలుష్య నియంత్రణ, ఉపాధి, ఎస్సీ, బీసీ సంక్షేమం, భూముల సర్వే, వ్యవసాయం, నీటిపారుదల, మున్సిపల్, విద్య తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



