Sangareddy

సంఘటితంగా ఉండి ఆర్యవైశ్యుల సంక్షేమానికి పాటుపడాలి

-తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కృష్ణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 6 (రథసారథి న్యూస్): ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండి తమ సంక్షేమంతో పాటు సమాజ అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం జహీరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా నామ రవికిరణ్ గుప్తా బాధ్యతలు స్వీకరించడంతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోపాజి అనంత కృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపార రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రాజకీయ రంగంలోనూ సముచిత ప్రాతినిధ్యం సాధించేందుకు ముందుకు రావాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ ఆర్యవైశ్య సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో జహీరాబాద్ ఆర్యవైశ్యులు విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఆర్యవైశ్యులు సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారని అన్నారు.

ఆర్యవైశ్యులు ఉన్న ప్రతి ప్రాంతంలో అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు నిర్మించడం, దేవాలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి ప్రతి కార్యక్రమంలోనూ ఆర్యవైశ్యుల సహకారం కీలకంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఆర్యవైశ్యుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, అదే స్ఫూర్తితో జహీరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఆర్యవైశ్య మహిళలు కూడా సంఘటితంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

-80 సార్లు రక్తదానం చేసిన శ్రీనివాస్‌కు సన్మానం

సుమారు 80 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావానికి ఆదర్శంగా నిలిచిన ఆర్యవైశ్య సభ్యుడు ప్రొద్దుటూరు శ్రీనివాస్‌ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

-నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా మాడిశెట్టి శ్రీనివాస్, కోశాధికారిగా బడంపేట్ శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడిగా అకారపు షణ్ముఖ్తో పాటు యువజన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బెజుగం శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షులు మునిగాల మాణిక్ ప్రభు, జూకంటి లక్ష్మణ్, రేజింతల్ సిద్ధి వినాయక ఆలయ అధ్యక్షుడు అశోక్ సంగయ్య రేజింతల్, ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు భూస శ్రీకాంత్, సదాశివపేట మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కంది కృష్ణ, సంఘం ప్రముఖులు నీలా వెంకటేశం, బెజుగం రాజగోపాల్, బెజుగం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బీదర్, తాండూర్, సదాశివపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, కుంచారం తదితర ప్రాంతాల ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button