ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ
-బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి -ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని వివరాలను తెలుసుకున్నారు.
ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ.. సమస్యల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్థానిక పోలీసు స్టేషన్‌లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, చట్టపరంగా పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.



