Sangareddy

భూముల హక్కులు కల్పించాలంటూ రైతుల వినతి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్):

రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన నిరుపేద రైతులు తమ భూముల హక్కులను పరిరక్షించి, న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని మాల, మాదిగ, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు సర్వే నంబర్లు 134, 135లోని సుమారు 760 ఎకరాల భూములను 1950 దశకం నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.

పశువులు, గొర్రెలు తదితరాలను విక్రయించి ప్రభుత్వానికి పన్నులు చెల్లించినట్లు పేర్కొన్నారు. 1954 నుంచి 1973, 1979–80 కాలానికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లోనూ తమ భూముల వివరాలు ఉన్నాయని రైతులు తెలిపారు. అయితే 1992లో అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూములను దున్నరాదని, సాగు చేయరాదని రైతులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 760 ఎకరాల్లో 119 మంది రైతులను గుర్తించినప్పటికీ, వారందరికీ హక్కులు కల్పించలేదని ఆరోపించారు. కొంతమంది రైతులకు 38-ఈ ధ్రువపత్రాలు జారీ చేసి అనంతరం వాటిని రద్దు చేశారని, 38-ఈ ధ్రువపత్రాలు పొందిన వారికి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్లు (ఓఆర్‌సీలు) ఇవ్వలేదని తెలిపారు.

తమ హక్కులు రద్దైన పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కొందరు వ్యక్తుల సహకారంతో భూములను ఆక్రమించుకున్నారని రైతులు ఆరోపించారు. తమకు తెలియకుండా భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొన్నారు.

దీంతో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై సమగ్ర విచారణ జరిపి, రెవెన్యూ రికార్డులను పరిశీలించి, అర్హులైన రైతులకు భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని వారు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button