Sangareddy

పోల్కంపల్లిలో న్యాయ అవగాహన కార్యక్రమం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా డ్రైవ్‌లో భాగంగా మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో మంగళవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేయడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, మధ్యవర్తిత్వం, లోక్‌ అదాలత్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని కార్యక్రమంలో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య హాజరై గ్రామస్థులకు న్యాయ సేవలు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమలు చేస్తున్న వివిధ పథకాలపై వివరించారు. పేదలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయ సహాయానికి దూరం కాకూడదని ఆమె సూచించారు. ప్రజలు తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకువచ్చి అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సౌజన్య కోరారు. న్యాయ హక్కులు, చట్టపరమైన పరిష్కార మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించి న్యాయాన్ని ప్రతి ఒక్కరి ముంగిటకు చేర్చడమే మెగా డ్రైవ్‌ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు, సిబ్బంది, పారా లీగల్‌ వాలంటీర్లు, పోలీసు సిబ్బంది, సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామస్థులు తమ న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేసుకున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button