Sangareddy

35 ఉన్నత పాఠశాలలకు జేఎల్‌ఐబీ కిట్ల పంపిణీ

ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (రథసారథి న్యూస్): విద్యార్థుల్లో ప్రయోగాత్మక, కృత్యాధార అభ్యసనాన్ని పెంపొందించేందుకు జన్యా ఫౌండేషన్‌, గ్లాండ్‌ ఫాసన్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న జన్యా ల్యాబ్‌ ఇన్‌ ఎ బాక్స్‌ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎంపికైన 35 ఉన్నత పాఠశాలలకు శాస్త్ర, గణిత విషయాలకు సంబంధించిన ప్రయోగాత్మక కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్‌. రోహిణి ఆదేశాల మేరకు ఎంపిక చేసిన 35 పాఠశాలల నుంచి ఒక్కో పాఠశాలకు జీవశాస్త్రం నుంచి ఒకరు, భౌతిక–రసాయన శాస్త్రాల నుంచి ఒకరు, గణితశాస్త్రం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలకు అనుగుణంగా విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన బోధనా–అభ్యసన సామగ్రి తో కూడిన జేఎల్‌ఐబీ కిట్లను పాఠశాలలకు అందజేశారు. సెప్టెంబర్‌ 9న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా సైన్స్‌ కేంద్రంలో శాస్త్ర ఉపాధ్యాయులకు, బీసీ స్టడీ సర్కిల్‌లో గణిత ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్‌. రోహిణి మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు జేఎల్‌ఐబీ కిట్లను తరగతి గదుల్లో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా కృత్యాధార బోధన, ప్రయోగాల ద్వారా సులభంగా అర్థమయ్యేలా బోధించాలని తెలిపారు.

ప్రయోగాత్మక అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ నుంచి డీసీఈబీ కార్యదర్శి లింబాజీ, ఏఎంవో బాలయ్య, డీఎస్‌వో పి. సిద్ధారెడ్డి, జన్యా ఫౌండేషన్‌ ఆపరేషన్స్‌ ఉపాధ్యక్షుడు కనకమేడల సురేంద్రకుమార్‌, కార్యక్రమ నిర్వాహకుడు డి.ఏ. శివకుమార్‌, కార్యక్రమ సమన్వయకర్త పి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button