గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 09 (రథసారథి న్యూస్):
జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వినాయక చతుర్థి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టర్ , ఎస్పీ తో కలిసి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. మండపాల వివరాలను నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలను నివారించేందుకు నాణ్యమైన విద్యుత్ వైరింగ్, తగిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు క్రేన్లు, తగిన లైటింగ్, బారికేడింగ్, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేలా ప్రజలు, ముఖ్యంగా యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమంలో పోలీసుల సూచనలు, నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆవిష్కరించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మత్స్యశాఖ, నీటిపారుదల, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంగారెడ్డి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.



