
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జి. భవానీ చంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టుతో పాటు జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్, జిన్నారం కోర్టు ప్రాంగణాల్లో లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాతీయ లోక్‌అదాలత్ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్, మోటారు వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్ తదితర రాజీకి వీలున్న కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారం ద్వారా సమయం, వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు లోక్‌అదాలత్‌లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేలా న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. పెండింగ్ కేసులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించకముందు దశలో ఉన్న వివాదాలను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ కేసుల పరిష్కారం కోసం సంబంధిత కోర్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లేదా తాలూకా న్యాయ సేవా కమిటీని సంప్రదించి లోక్‌అదాలత్ ద్వారా పరిష్కారానికి ముందుకు రావాలని జి. భవానీ చంద్ర పిలుపునిచ్చారు. రాజీ మార్గమే ఉత్తమ మార్గం – లోక్‌అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సహకరించాలని ఆమె కోరారు.



