జిల్లా ఖజానా కార్యాలయంలో వార్షిక తనిఖీ
-ఖజానా నిర్వహణలో నిబంధనలు, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి -సీనియర్ డీఏజీ ఎం. నరేష్ కుమార్

సంగారెడ్డి, సెప్టెంబర్ 11(రథసారథి న్యూస్):-
తెలంగాణ రాష్ట్ర సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎం. నరేష్ కుమార్
( ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అధికారి) శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఖజానా కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈనెల 7 నుండి కొనసాగుతున్న వార్షిక ఆడిట్‌లో భాగంగా చివరి రోజున ఆయన కార్యాలయాన్ని సందర్శించి, వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌తో పాటు జిల్లాలో పనిచేస్తున్న ఏటీఓలు, ఎస్‌టీఓలతో ఆయన సమావేశమై ఖజానా నిర్వహణ, ఆడిట్ అంశాలు, కార్యాలయ విధులపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ అభ్యంతరాలు, ప్రస్తుత ఆడిట్ అభ్యంతరాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణలో నిబంధనలు, విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా పేపర్‌లెస్ ఆన్‌లైన్ బిల్లుల సమర్పణ జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది విధి విధానాలను పూర్తిగా అవగాహన చేసుకొని, ఎలాంటి లోపాలకు తావులేకుండా బిల్లుల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియను సక్రమంగా, సకాలంలో నిర్వహించాలని, అదేవిధంగా నెలవారీ అకౌంట్స్ నిర్ణీత గడువులోగా అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.
ఖజానా కార్యాలయాల్లో రికార్డులు, రిజిస్టర్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి భద్రపరచాలని, ప్రభుత్వ నిధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. జిల్లా ఖజానా కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, విధుల అమలు, ఆడిట్ ప్రక్రియకు సంబంధించి చేపడుతున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఏ టి ఓ లు, ఎస్‌టీఓలు సంపత్ స్వరూప్, రాజారెడ్డి, శారద, ఏటీఓలు, జిల్లా ఖజానా కార్యాలయంలోని వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.



