Sangareddy

శాస్త్రీయ పద్ధతిలో బీసీ కులగణన చేపట్టాలి

-ప్రతి కులానికి ప్రత్యేక సంకేత సంఖ్య కేటాయించాలి

సంగారెడ్డిలో బీసీల ధర్మ పోరాట దీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 11 (రథసారథి న్యూస్): దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ జనగణనలో బీసీ కులగణనను శాస్త్రీయ, సమగ్ర, పారదర్శక పద్ధతిలో చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం–సంగారెడ్డి జిల్లా డిమాండ్ చేసింది. 2025 మే 1న ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, దాన్ని సమగ్రంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం నిర్వహించనున్న కులగణనలో బీసీల జనాభాను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించకపోతే భవిష్యత్తులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బీసీ కుటుంబాన్ని సమగ్రంగా నమోదు చేయడంతో పాటు, ప్రత్యేక బీసీ విభాగాన్ని ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక సంకేత సంఖ్య కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించిన ఖచ్చితమైన జనాభా గణాంకాలు అందుబాటులో ఉంటేనే విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.

అందువల్ల ప్రతి బీసీ కుటుంబాన్ని, ప్రతి కులాన్ని ఎలాంటి లోపాలకు తావులేకుండా శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం–సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ‘బీసీల ధర్మ పోరాట దీక్ష’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, విద్యార్థి, యువజన నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కులగణనలో ప్రత్యేక బీసీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక సంకేత సంఖ్య కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

బీసీల జనాభాకు సంబంధించిన సమగ్ర, కచ్చితమైన గణాంకాలు లేకుండా భవిష్యత్తులో బీసీలకు సముచిత న్యాయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీసీల భవిష్యత్ తరాలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి శాస్త్రీయమైన, సమగ్ర, పారదర్శకమైన బీసీ కులగణన నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం–సంగారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్నవారు: డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, ఆర్‌సీ పురం మాజీ కార్పొరేటర్ పుష్పా నాగేష్, వినీత సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సుకూరి జగదీశ్వర్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గొరుగంటి రమేష్ కుమార్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమేష్ గౌడ్, బాలు యాదవ్, లాడే మల్లేష్, యాదగిరి, ప్రభు గౌడ్, వెంకటేశం గౌడ్, రామా శ్రీనివాస్ గౌడ్, వి. రామ్ నారాయణ, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు, నాగరాజు, వీరేశం, టి. రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button