
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లా కల్హేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా దెగ్లూర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఎంహెచ్–06–ఏఎన్–7306 నంబరు గల స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 4.15 గంటల సమయంలో బాచేపల్లి గ్రామ సమీపంలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద జాతీయ రహదారి–161పై డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో స్కార్పియో ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం హైవేను దాటి సర్వీస్ రోడ్డుపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ షామీన్ బేగం (50), మహమ్మద్ అనాబియా తస్కీం (4) ఘటన స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మహమ్మద్ నదీమ్ (32)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
మరో వ్యక్తి మహమ్మద్ నవీద్ (28) తీవ్ర గాయాలతో సంగారెడ్డిలోని వెల్‌నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ రోడ్డు పరిస్థితులు, వాహనం వేగం, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెలికితీసి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే, గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పోలీసు అధికారులను సూచించారు.
ఈ ఘటనపై కల్హేర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అధిక వేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పరిమిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారు తగినంత విశ్రాంతి తీసుకుని అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



