చేనేత కళకు ఆదరణ పెంచాలి
–చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి -జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హ్యాండ్లూమ్ వాక్కు శ్రీకారం చుట్టిన అడిషనల్ కలెక్టర్ పాండు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): చేనేత రంగం దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని, చేనేత కళాకారుల నైపుణ్యానికి తగిన గుర్తింపు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పాండు పేర్కొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన హ్యాండ్లూమ్ వాక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, తరతరాలుగా చేనేత వృత్తిని కొనసాగిస్తూ అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తున్న చేనేత కార్మికులు దేశ సంప్రదాయాన్ని, కళా వైభవాన్ని సజీవంగా నిలబెడుతున్నారని కొనియాడారు.
వారి శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ప్రోత్సాహక పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు వాటి ప్రయోజనాలను పొందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ హ్యాండ్లూమ్ వాక్ ర్యాలీలో హ్యాండ్లూమ్ శాఖ సహాయ సంచాలకులు వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, చేనేత కార్మికులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



