టీసీ కోసం తండ్రి ఆందోళన.. పాఠశాల గేటు ముందు నిరసన
-యాజమాన్యం స్పందించడంతో చివరకు టీసీ అందజేత
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్):
జహీరాబాద్ పట్టణంలోని ఇండస్ యూనివర్సల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినికి టి సీ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ ఆమె తండ్రి గోవర్ధన్ మంగళవారం పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగారు. పెట్రోల్ సీసా చేతబట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడతానంటూ హెచ్చరించడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోవర్ధన్ మాట్లాడుతూ, తమ కుమార్తె ఈ పాఠశాలలో ఐదో, ఆరవ తరగతులు చదివిందని తెలిపారు.
కుటుంబ అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి మారుతున్నందున నాలుగు రోజుల క్రితమే టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే, పాఠశాల యాజమాన్యం ఏడు పని దినాలు పూర్తయిన తర్వాత మాత్రమే టీసీ ఇస్తాం అని చెబుతూ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి ని కలిసి ఫిర్యాదు చేయగా, టీసీ జారీకి సంబంధించి ఏడు పని దినాలు అనే నిబంధన లేదని, వెంటనే పత్రాలు అందజేయాలని పాఠశాల యాజమాన్యానికి సూచించినప్పటికీ స్పందించలేదని గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆందోళన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం గోవర్ధన్‌తో చర్చించి పరిస్థితిని సర్దిచెప్పింది. అనంతరం విద్యార్థినికి టీసీతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను అందజేయడంతో వివాదం ముగిసింది. దీంతో ఆయన ఆందోళనను విరమించారు.



