Sangareddy

నలుగురు ముఖ్యమంత్రుల సహకారంతో రాజీవ్ ఉద్యానవనం అభివృద్ధి

మొదటి దశ పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

–త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభోత్సవం నిర్వహిస్తామని వెల్లడి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ ఉద్యానవనం ఏర్పాటుతో పాటు అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజీవ్ ఉద్యానవనాన్ని సందర్శించిన ఆయన అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఉద్యానవనం అంతటా తిరుగుతూ పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను పరిశీలించడంతో పాటు నీటి చిమ్మే అలంకార నిర్మాణం పునరుద్ధరణ పనులను కూడా తనిఖీ చేసి, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఉద్యానవనం ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కె. రోశయ్య శంకుస్థాపన చేయగా, తదనంతరం ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. గత పదేళ్ల పాలనలో ఉద్యానవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిందని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సహకారంతో పాటు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి టి.కె. శ్రీదేవి సహకారంతో తొలి దశలో రూ.3 కోట్ల వ్యయంతో ఉద్యానవన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండో దశలో మరో రూ.6 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. పనులు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యానవనాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిశన్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, పురపాలక ఉపాధ్యక్షుడు షఫీ హఫీజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్లు మహేష్, నవాజ్, పురపాలక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button