సంగారెడ్డిలో అధ్వాన్న రోడ్లతో ప్రజల అవస్థలు
-న్యూ సాయి నగర్, బృందావన్ కాలనీల్లో మౌలిక వసతుల లేమిపై ఆవేదన-తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని న్యూ సాయి నగర్, బృందావన్ కాలనీల్లో రోడ్లు అధ్వాన్నంగా మారడంతో పాటు డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థలు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు బురదమయంగా మారి, గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నిత్యం ప్రమాదాల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొనగా, వాహనాలు బురదలో చిక్కుకునే ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
న్యూ సాయి నగర్ కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి కాలువలు లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని పేర్కొంటున్నారు. ఇక బృందావన్ కాలనీవాసులు 2009లో గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు సుమారు 40 అడుగుల వెడల్పుతో ఉన్న రహదారి, మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత క్రమంగా ఆక్రమణలకు గురై ప్రస్తుతం సుమారు 13 అడుగులకు కుదించబడిందని ఆరోపిస్తున్నారు.
దీంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారిందని, వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. మున్సిపాలిటీకి ప్రతి ఏడాది లక్షల రూపాయల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల కాలువలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూ సాయి నగర్, బృందావన్ కాలనీల్లో తక్షణమే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి, వర్షపు నీటి పారుదల కాలువలను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. పన్నులు మా బాధ్యత… అభివృద్ధి మీ బాధ్యత అంటూ ప్రజల ప్రాణాలు, ప్రయాణ భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



